తిండి తిప్పలు: బెక బెకల పక పకలు
దేవుడా....
స్నేహితునికి కుడా ఈ కష్టం రాకూడదు. (కాస్త ఎక్కువైందా?). చక్కగా పిజ్జాలూ, బర్గర్లూ తింటూ ఏసీ రూముల్లో కూచునే వాడిని. లేదా ఇంట్లోనే అమ్మ చేతి వంట తింటూ ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఈ ఖర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఎక్కడ ఏ స్పెషల్ చూసినా బెక బెకలో, బొవ్ బొవ్ లో, బుస్ బుస్ లో. శాకాహారం మచ్చుకైనా కానరాని ముచ్చు ప్రదేశంలో ఆకలితో అలమటించలేక ఎప్పుడో మానేసిన నాన్-వెజ్ తినాల్సి వచ్చింది.
పొద్దున నిద్ర లేచి నా దగ్గరున్న టీ పొట్లంతో ఏదో కానిచ్చి మళ్ళీ సిటీలో ఉన్న నా హోటల్ రూమ్ కి వెళ్ళాను. ఇంతలో అక్కడ నా పక్క రూం లో ఉన్న ’కిమ్ సాంగ్-జు’ నాకు హాయ్ చెప్పింది. అదేదో బూతులా నాకు వినిపించింది. ఇప్పుడర్ధమైందనుకుంటా నేనెక్కడున్నానో.
నవ్వు ముహం ఎక్కడైనా ఒకటే అని నాకు తెలుసు. (కామన్సెన్స్ ఎక్కువలే) అందుకే అలా ఒక నవ్వు విసిరా. ఆ పిల్ల కూడా చాలా బాగుంటుంది. అచ్చ చీనీ కళయినా కాస్త zhang ziyi లాగా బాగుంది. లాగా అంటే లాగా అని కాదు. కాస్త ఆ కళా ఉందని. క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ హీరోయిన్! తెలుసు కదా.
టిఫిన్ చేద్దామని చూద్దామా... ఎక్కడ బెక్ బెక్ లు కలుస్తాయో అని భయం. ఏదో అలా సరిపెట్టేదామని కందమూలాదులని బయటకు తీసి కారిడార్ నుంచి రూమ్ లోకి వెళ్ళబోతున్నాను. ఇంతలో ఎలక్కోతుల కిచ కిచలు వినిపించాయి. మధురంగా.
కొంపదీసి కోతులేమన్నా దాడి మొదలెట్టాయా అని నేను (కంగారేం లేదు కానీ నా పరిస్థితి కుంపట్లో మాగిన కుంకుడు కాయ లాగా తయారైంది. మనో వికలత చేత అలా ఉందన్నమాట) వెనక్కి తిరిగేలోపలే నామీద ఒక చెయ్యి పడింది.
"మిస్సియొ డన రజ్జ్ ॓%(ఽ%॑॓%%॓॑॑$%%%$##$4," ఇంకేంటొ తెలియని మాటాలు వినిపించాయి.
"యా, వాడ్యు వాన్?" నేనన్నాను. అమ్మా తల్లే కాస్త నువ్వే భాష లో మాట్లాడావో చెప్పు. అని మొత్తుకోబోయి తమాయించుకున్నాను. ఒక అరవై తొమ్మిది సార్లు విన్నాక నాకు అర్ధం ఐందేంటంటే
"Mr. Dhanaraj, today is my birthday, and I'm missing my family and friends. I'm gonna have a special dinner. I want you come. I'm politely inviting you."
సరే కదా ఏదో స్పెషల్ డిన్నర్ కదా అని వెళ్ళబోయా. మనసులో ఏదో ఓమెన్ (Omen) ఫీలింగ్ ఉన్నా ఎటూ నాన్-వెజ్ తిందామనుకున్నా కదా. సమస్య ఏముంది. అంతగా ఇబ్బందైతే ఏ చికెనో స్పెషల్ గా తెప్పించుకోవచ్చు. ఆ పిల్లకిబ్బందైతే మనకి డబ్బుల ప్రాబ్లమేముందనే ధైర్యంతో ముందుకు పోతా ఉన్నా.
"పోవుగాలము వచ్చిన వానికి పోగాలపు బుద్ధులే బుట్టున్."
-మాస్టర్జీ ఉవాచ
దాదాపూ గంట విన్నాక నాకు ఆ చీనీ పిల్ల కిమ్ సాంగ్-జు మాటలు ఏడెనిమిది సార్లకే అర్ధం కా సాగినై (ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ). ఆ చీనీ హాసిని లొడలొడా వాగుతూనే ఉంది. నేను మాత్రం బ్యూటీ బాగుంది కదాని తన కంపనీని (కుంఫణీ వాడదామనుకున్నగానీ ట్రేడు మార్కు సమస్య) ఎంజాయ్ చేస్తూ ఉన్నాను.
ఇంతలో ఎంటర్ ద డ్రాగన్ లాగా ఎంటర్ ద ఫుడ్ ఐటంస్.
"అవేంటి?" అడిగాను. ఐదో సారికే అర్ధం అయింది. "నూడిల్స్ విత్ ఫ్రాగ్ మంచూరియా" అని. మొదటి రోజున తెలియక తిన్నా ఏమీ కాలేదు కదా అని ధైర్యంతో కాస్త వడ్డింపజేసుకుని వీలైనంతలో ఆ ముక్కలని తీసివేసి తిన్నాను. నేను నాకక్కర్లేనివి ఆ పిల్ల పళ్ళెంలోనే వేశాను. అదేదో బంగాళ దుంప వేపుడైనట్లు మహదానందంగా తింటోంది కిమ్ సాంగ్-జు.
తరవాత ఏమి కావాలని అడిగింది. నేను నాన్-వజ్ వద్దు అన్నా. ప్లీజ్ ఇవాళ నా బర్త్ డే. (కొంచంలో తప్పింది కానీ ఆ రోజు నా డెత్ డే అయ్యేది. ఏదో మాస్టర్జీ ఆశీస్సులు). యూ ఆర్డర్ ఎనీ ఐటం . ఐ హావ్ నో ప్రాబ్లం అంది.
సరే నాకు ఆ చైనీస్ అంతగా రాదు. ఎనీ చికెన్ ఐటం చెప్పెయ్ అన్నా. మళ్ళా ఏవో ఎలక్కోతి కిచ కిచలు. కాసేపయ్యాక వచ్చింది. నా మృత్యు దేవత.
ఎలా తిన్నానో తెలియదు. ఏమి తిన్నానో తెలియదు. మొత్తానికీ ఎలాగో కిమ్ సాంగ్-జు మొహం చూస్తూ కానిచ్చాననిపించి తన సహాయంతోనే నా రూమ్ కి వెళ్ళా.
తెల్లారక ముందే నా బతుకు తెల్లారింది. స్టమక్ క్రాంప్స్. పది రోజుల పైన చచ్చాను. ఏదో గంభీరంగా నెట్టుకొచ్చాను కానీ, అమ్మో పగవానికే కాదు. స్నేహితులకి కూడా ఆ కష్టాలు వద్దు.
మూడో రోజున కిమ్ సాంగ్-జు వచ్చి పలకరించింది. ఆ ఎలక్కోతి కిచ కిచ లలో నాకు అర్ధం అయింది ఏమిటంటే, నాకు ఆ రోజు పెట్టింది ’పాము కరచిన చికెన్’. హత విథీ! చీనీ పిల్ల మోజులో పడి ప్రాణం మీదకి తెచ్చుకున్నానా! అని అరికాళ్ళు కొట్టుకుని (తల కొట్టుకుందామనుకుంటే నా మెదడు అరికాల్లోకి వచ్చి తిష్ట వేసుక్కూర్చుని రెండు రోజులు దాటింది)తనని ఏమీ అనలేక ఎదో సర్ది చెప్పి పంపాను.
తను వెళ్తూ వెళ్తూ బాధగా, "$^*((%^%$&^(*^&*%%#$_)( *^&* *&^&^" ఎలక్కోతి కిచ కిచలతో నిష్క్రమించింది.
పదో రోజున మళ్ళా నా రూమ్ లోకి వచ్చి, ఈ సారి రెండో సారికే అర్ధం అయింది. తను హాయ్ అందని, పలకరించింది. నాకు ఇవాళ దశ దిన కర్మలు చేయవచ్చావా అనుకున్నా, గంభీరంగా ఒక నవ్వు నవ్వా. ఎక్కడైనా నవ్వు నవ్వేగా.
చేతిలోంచీ కాస్త కుంకం తీసి నాకిచ్చి (అయ్యో అయ్యో నాకి ఇవ్వటం కాదు. నాకు, అనగా ధనరాజ్ మన్మధ కి) పెట్టుకోమంది. ఎక్కడిదో అడక్కుండానే ఎవరో ఇండియన్స్ కనిపిస్తే దేవుడి దగ్గర పెట్టిన కుంకుమ నాకోసం తెచ్చిందట.
"ఆహా! ఎంత చీమ (ఈ పదం నాది కాదు. చీనీ + ప్రేమ గివ్స్ రైజ్ టు చీమ)" అనుకున్నా.
తర్వాత గత వారం రోజుల్లో బాగా ఫ్రెండ్స్ అయ్యామనుకోండీ. ఇదేనేమో లవ్ ఎట్ బెకెన్ సైట్ అంటే.
మాస్టర్జీకి జరిగింది చెప్తే, "హాయిగా ఈ లైనేదో అరవ పిల్లకేస్తే వడా సాంబార్ దొరికేవి. చీనీయులతో కష్టం," అన్నాడు. నిజమే కదా!
ఇవండీ, నా అరవచీనీ తిండి తిప్పలు.
11 comments:
ధన,
ఒక్క కిమ్ సాంగ్-జుతోనే ఇన్ని సమస్యలైతే ఇంకా లూసీ-లూ(చార్లీస్ ఏంజెల్స్),aniTa mui (ఇప్పుడు లేదులే, పోయింది)వీళ్లంతా కూడా కలిస్తే ఏమై ఉండేదో?
మొత్తానికి "మాస్టర్జీ"ఆశీస్సులెప్పుడూ ఉండాల్సిందేనన్నమట. మాస్టర్జీ అరవ పిల్లకే వేసారా లైనూ! ఆ అరవమ్మాయి అడ్ద్రసు నా దగ్గరుంది మరి! జాగ్రత్తని చెప్పండి ఆయనకు!
నేను పేపర్లో పాము కరిచిన చికెన్ సంగతి చదివిన మర్నాడే మీరు తిన్నారన్నమాట.
బాగుంది
బ్రదరూ మనలో మన మాట ఆ పిల్లకి ఊరికే లైనేసావ లేకపొతే నిజం గానే లవ్వా ....
too good..:)
ధన,
కిమ్ సాంగ్-జు ని అడిగినట్టు చెప్పు. మరి కీరా నైట్లీ సంగతేంటి?
@విష్వక్సేనుడు,
అదే అర్ధం కావట్లేదు బ్రదరూ. ఇప్పటికైతే స్నేహమే. ఏవో కాస్త సినిమాలూ షికార్లూ అంతే. ఇకముందెలా వెళ్తుందో మరి!!! ఇంకో నెల్లో ఇండియా వచ్చేస్తాను.
@సుజాత గారు,
ఏదో మీ అభిమానం. Love knows no boundaries కదా! aniTa mui మరీ అంత గొప్ప అందగత్తె కాదుకానీ, కొన్నాళ్ళు కల్లోకి వచ్చింది. :-D
మాస్టర్జీ ఆశీస్సులుండలి. మంచి బాలుడు కదా. అసలే బుజ్జి బాబు మరి. పిల్లలూ దేవుడూ చల్లని వారే... హిహిహి.
@Srujana Ramanujan,
కొన్ని సార్లు పెద్దల కోసం త్యాగం చేయాలి. :-D
హ హ చైనా వాళ్ళ ఇంగ్లీష్ ని భలే వర్ణీంచారు.. నేనూ ఇక్కడ వాళ్ళ బాష అర్దం కాక చాలా తిప్పలు పడ్డాను :)
>>అదే అర్ధం కావట్లేదు బ్రదరూ. ఇప్పటికైతే స్నేహమే. ఏవో కాస్త సినిమాలూ షికార్లూ అంతే. ఇకముందెలా వెళ్తుందో మరి!!! ఇంకో నెల్లో ఇండియా వచ్చేస్తాను.
అంటే పని అయిపొయా లేకపోతే పిల్ల నుంచి పారిపోతున్నారా
బాస కీరా నైట్లీ కి నీకు సంబంధం ఏంటి ?
Post a Comment